తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వర్గీకరణ అంశంపై అల్టిమేటం జారీ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న లక్ష డప్పులు, వేల గొంతుల సన్నాహక సమావేశం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాలులో శుక్రవారం జరిగింది.
ఈ సమావేశంలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటం మొదలవుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీపై కట్టుబడి ఉంటే ఈ నెల 7వ తేదీలోగా ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏడవ తేదీలోపు ఎస్సీ వర్గీకరణ చేపట్టకపోతే మాదిగల సునామీ హైదరాబాద్‌ను తాకుతుందని, ఈ సునామీలో ఎవరైనా కొట్టుకుపోక తప్పదని మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ తెలంగాణలో మొదటగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఐదు నెలలు గడిచినా ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. అందువల్లే లక్ష డప్పులు, వేల గొంతుల కార్యక్రమానికి పిలుపునిచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే 7వ తేదీన తమ లక్ష డప్పులు – వేల గొంతుల కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉండదని అన్నారు.
కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని, కానీ ఇక్కడ అమలు చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాల రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు ఎస్సీ వర్గీకరణ చేయకపోవడంతో ఎంతో మంది మాదిగ నిరుద్యోగులు నష్టపోయారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు అడ్డుతగిలే మాలలకు భవిష్యత్తులో పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. వారి మాటలు విని వర్గీకరణ చేయకుంటే రేవంత్ ప్రభుత్వం కూడా కుప్పకూలిపోతుందని మంద కృష్ణ మాదిగ అన్నారు.