సల్మాన్ సినిమాలో పాట.. బాలీవుడ్‌లో ఇదే తొలిసారి..!
తెలంగాణ బతుకు చిత్రానికి, సంస్కృతి సంప్రదాయానికి ప్రతీకగా జరుపుకునే.. బతుకమ్మ పండుగకు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం తెలంగాణలోకి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ పూల సంబురం.. ఇప్పుడు తెలంగాణ అంటే బతుకమ్మ పండుగ అనేంత ప్రఖ్యాతి గాంచింది. తెలంగాణ ప్రజలు ఎక్కడుంటే అక్కడ.. ఈ పూల పండుగను నిర్వహిస్తూ తమ సంప్రదాయాన్ని ప్రంపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు.. ఆ తొమ్మిది రోజులు తెలంగాణతో పాటు దేశ విదేశాల్లోనూ ఈ సంబురాన్ని సందడిగా జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ బతుకమ్మ క్రేజ్ సినిమాల్లోకి కూడా వచ్చింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చే సినిమాల్లో బతుకమ్మ పండుగ కనిపించటం సాధారణమే అయితే.. అటు బాలీవుడ్ సినిమాల్లోనూ బతుకమ్మ కనిపించనుంది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా.. ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలో తెలంగాణ బతుకు చిత్రం బతుకమ్మ సంప్రదాయాన్ని చూపించనున్నారు. అందుకోసం ఏకంగా ఓ పాటనే చిత్రీకరించారు. ఈ సినిమాలో తెలుగు హీరో విక్టరీ వెంకటేష్, భూమిక ప్రధాన పాత్రల్లో కనిపిస్తుండగా.. హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తోంది. అయితే.. వీళ్ల కుటుంబం తెలంగాణ ప్రాంతానికి చెందినదై ఉండటం వల్ల.. ఈ పాట పెట్టినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ మధ్య సినిమాల్లో తెలంగాణ భాషాకు గానీ.. తెలంగాణ నేటివీటీకి గానీ.. చాలా క్రేజ్ ఏర్పడింది. తెలంగాణ నేపథ్యంతో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలోనే.. సెంటిమెంట్ వర్కవుట్ చేసేందుకే సల్మాన్ సినిమాలో బతుకమ్మ పాట పెట్టినట్టు తెలుస్తోంది.
అయితే… ఈ పాటను ఈరోజు విడుదలచేయగా.. దీనిపై భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బతుకమ్మ క్రేజ్ పాన్ ఇండియా లెవల్‌కు పెరిగిందంటూ ట్వీట్ చేశారు. కాగా.. బతుకమ్మ ప్రాముఖ్యత విదేశాలకు కూడా విస్తరించేందుకు జాగృతి ఆధ్వర్యంలో కవిత.. కృషి చేస్తున్న విషయం తెలిసిందే.