AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

10 మంది చిన్నారుల సజీవదహనం.. ఉత్తర్‌ ప్రదేశ్‌ ఝాన్సీలో ఘోరాతిఘోరం..

మెడికల్‌ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం..

ఉత్తర్‌ ప్రదేశ్‌ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్‌ కాలేజీలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది చిన్నారులు మృతి చెందారు. సమాచారం ప్రకారం కళాశాలలోని శిశువుల వార్డులో రాత్రి ఆకస్మాత్తుగా మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఆ క్రమంలో పది మంది నవజాత శిశువులు కాలిన గాయాలతో ఊపిరాడక మరణించారు. మంటలు చెలరేగిన వార్డులో 54 మంది నవజాత శిశువులు ఉన్నట్లు డివిజనల్‌ కమిషనర్‌ బిమల్‌ కుమార్‌ దూబే తెలిపారు. ఆ గదిలో ఆక్సిజన్‌ అధికంగా ఉన్నందున, మంటలు వేగంగా వ్యాపించాయి.

దాదాపు 15 ఫైర్‌ ఇంజన్లతో..
సమాచారం అందుకున్న వెంటనే దాదాపు 15 ఫైర్‌ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆర్మీ, అగ్నిమాపక దళం కలిసి మంటలను ఆర్పివేశారు. ఈ సందర్భంగా కిటికీలు, తలుపులు పగలగొట్టి దాదాపు 40 మంది చిన్నారులను బయటకు తీశారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న ప్రజల్లో భయాందోళన నెలకొంది. గాయపడిన పిల్లలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

ప్రత్యక్ష సాక్షులు ఎమన్నారంటే..
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వార్డు నుంచి పొగలు రావడం కనిపించిందన్నారు. ప్రజలకు ఏమీ అర్థం కాకముందే మంటలు ఎగసిపడ్డాయి. కొద్దిసేపటికే వార్డులో మంటలు వ్యాపించడంతో తొక్కిసలాట జరిగింది. పసికందులను బయటకు తీసే ప్రయత్నం చేసినా తలుపు వద్ద పొగలు, మంటలు రావడంతో సకాలంలో బయటకు తీయలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది రాగానే శిశువులను బయటకు తీయగలిగారు. మొదట ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌కు మంటలు అంటుకున్నాయని, కొద్దిసేపటికే వార్డు మొత్తం మంటల్లో చిక్కుకుందని చెబుతున్నారు.

12 గంటల్లో నివేదిక ఇవ్వాలి..
ఈ ఘటనపై విషయం తెలుసుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఉప ముఖ్యమంత్రి, వైద్య శాఖ మంత్రి బ్రజేష్‌ పాఠక్‌లను మెడికల్‌ కాలేజీకి వెళ్లాలని సూచించారు. ఆయన వెంట ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఉన్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేయాల్సిందిగా ఝాన్సీ డివిజనల్‌ కమిషనర్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌లను ఆదేశించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం.. 12 గంటల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం
పరిస్థితిని సమీక్షించిన ఉపముఖ్యమంత్రి పాఠక్‌ నవజాత శిశువులు చనిపోవడం చాలా దురదృష్టకరమన్నారు. నవజాత శిశువుల మృతదేహాలను గుర్తించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మొదటి విచారణ ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. రెండో విచారణ పోలీసు పరిపాలన ద్వారా జరుగుతుందన్నారు. అగ్నిమాపక శాఖ బృందం కూడా ఇందులో భాగం కానుంది. థర్డ్‌ మెజిస్టీరియల్‌ విచారణకు కూడా ఆదేశాలు వచ్చాయి.

అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తామన్నారు. ఏదైనా పొరపాటు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ విడిచిపెట్టబోమన్నారు. పిల్లల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరిలో ఫైర్‌ సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించారు. జూన్‌లో మాక్‌ డ్రిల్‌ కూడా నిర్వహించారు. ఈ ఘటన ఎలా, ఎందుకు జరిగిందనేది విచారణ నివేదిక వచ్చిన తర్వాతే చెప్పగలమని ఉపముఖ్యమంత్రి అన్నారు.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10