AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ధైర్యం ఉంటే పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించాలి

కేటీఆర్ కు నిజంగా పరువుంటే టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కేసును ఈడీ దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ నేతలు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పరువున్నోళ్లు పరువు నష్టం దావా వేయాలన్న రేవంత్.. కేటీఆర్ కు చీము నెత్తురుంటే పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటూ లేఖ రాయాలన్నారు. కేటీఆర్ పరువుకు 100 కోట్లని ఆయన ఎలా నిర్ణయించాడని రేవంత్ ప్రశ్నించారు. వంద కోట్లిస్తే కేటీఆర్ ను బూతులు తిట్టొచ్చా? అని ప్రశ్నించారు. పేపర్ లీక్ కేసులో నిందితులకు కేటీఆర్ కు సంబంధమేంటని.. అసలు కేటీఆర్ కు ఎగ్జామ్ డేలా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అధికారులు కాకుండా కేటీఆర్ కు డేటా ఎవరిచ్చారో ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు రేవంత్. కటాఫ్ మార్కులు ఎంతో కేటీఆర్ కు ఎలా తెలుసన్నారు. 415 మంది జగిత్యాల నుండి గ్రూప్ 1 పరీక్ష రాశారని కేటీఆర్ ఎలా చెప్పారని ప్రశ్నించారు రేవంత్.

పేపర్ లీక్ కేసులో కావాల్సిన వాళ్లను కాపాడేందుకే సిట్ ఏర్పాటు చేశారని రేవంత్ ఆరోపించారు. గతంలో ఇలాగే సిట్ ఏర్పాటు చేసిన కేసులన్నీ తప్పుదోవపట్టించారని విమర్శించారు. ప్రభుత్వం ఇరుకున పడ్డప్పుడల్లా సిట్ ను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. పేపర్ లీక్ కేసులో ఏ1గా శంకర్ లక్ష్మీని చేర్చాలని డిమాండ్ చేశారు. శంకర్ లక్ష్మీకి తెలియకుండా ఏం జరగదన్నారు. ఆర్థిక పరమైన నేరారోపణలున్నప్పుడు కేసును ఈడీతో విచారణ జరిపించాలన్నారు రేవంత్. పేపర్ లీక్ కేసుపై ఢిల్లీలో సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు సిట్ సీజ్ చేసిన వాటిని ఈడీ తీసుకోవాలన్నారు.

లక్షల మంది నిరుద్యోగులతో చెలగాటమాడొద్దని రేవంత్ కోరారు. ఇంత జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదన్నారు రేవంత్. కేసీఆర్, కేటీఆర్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ పై సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలకు సిట్ నోటీసులివ్వడమేంటని ప్రశ్నించారు. ఆందోళన చేస్తే అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు. పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10