సంచలనం రేపిన జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో కేటీఆర్ బావమరిది పాకాల రాజ్ విచరాణకు హాజరయ్యారు. మోకిల పోలీస్ స్టేషన్‌కు 12 లాయర్లతో కలిసి వచ్చారు. అయితే, విచారణలో ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు. సుమారు 3 గంటలపాటు విచారించారు పోలీసులు. అనంతరం సీన్ రీక్రియేషన్ కోసం జన్వాడ ఫాంహౌస్‌కు తీసుకెళ్లారు.
విచారణలో ప్రశ్నల వర్షం
నార్సింగి ఏసీపీ ఆధ్వర్యంలో పాకాల రాజ్ విచారణ జరిగింది. 9 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో జరిగిన పార్టీ, విజయ్ మద్దూరి స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించారు. తనకు కొకైన్ ఇచ్చింది రాజ్ అని చెప్పిన నేపథ్యంలో అది ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో విచారించారు. విచారణలో భాగంగా రాజ్ పాకాల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. మరో నిందితుడు విజయ్ మద్దూరిని మరోసారి విచారించనున్నారు. ఇప్పటికే ఓసారి విచారణకు ఆయన డుమ్మా కొట్టారు.
విచారణ తర్వాత ఫాంహౌస్‌లో తనిఖీలు
మోకిల పీఎస్‌లో పాకాల రాజ్ విచారణ తర్వాత తన ఫాంహౌస్‌కి తీసుకెళ్లారు పోలీసులు. ఆ సమయంలో మీడియా ఆయన్ను ప్రశ్నించగా, సమాధానాలు దాటవేశారు. ఫాంహౌస్ లోపల ఆరోజు రాత్రి జరిగిన ఘటనను సీన్ రీ క్రియేట్ చేశారు పోలీసులు. మరోసారి తనిఖీలు చేశారు. దాదాపు గంట పాటు ఫాంహౌస్‌లో సోదాలు కొనసాగాయి. సెల్ ఫోన్ కోసం తనిఖీలు చేసిన పోలీసులు, అది లభించకపోవడంతో తర్వాత పాకాల రాజ్‌ను స్టేషన్‌కి తీసుకొచ్చి విచారించారు.
ఫాంహౌస్ దగ్గర ఉద్రిక్తత
పాకాల రాజ్ ఫాంహౌస్‌లో తనిఖీల సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ సన్నిహితులు అక్కడకు వచ్చారు. కేటీఆర్ ఫ్రెండ్ జాన్సన్ నాయక్ రాగా, పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి కావాలని ఆయన కోరగా, అందుకు కుదరదని స్పష్టం చేశారు. గేటు దగ్గరే జాన్సన్‌ను నిలిపివేశారు.