తమిళనాడులోని చెన్నై శివారులో శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువళ్లూరు సమీపంలోని కావరిపెట్టై వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన రెండు బోగీలు దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగడంతో పలువురు ప్రయాణికులు గాయపడినట్టు రైల్వే పోలీసులు తెలిపారు.
గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలును మైసూర్ – దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలుగా గుర్తించారు. పట్టాలపై నిలబడి ఉన్న గూడ్స్ రైలును అతి వేగంతో వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాద ఘటనలో పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనాస్థలిలో రైల్వే అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సమీప ఆస్పత్రులకు తరలించారు.