AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శపథం నెరవేర్చుకున్న చంద్రబాబు.. సీఎంగానే అసెంబ్లీకి ..

(అమ్మన్యూస్, అమరావతి):
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శపథం నెరవేర్చుకున్నారు. సీఎంగానే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఏపీలో 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన టీడీపీకి అసెంబ్లీలో అప్పట్లో దినదిన గండంగా ఉండేది. 151 సీట్లలో బలంగా ఉన్న అప్పటి అధికార పక్షం వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం జగన్‌ కూడా విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు టార్గెట్‌ గా రెచ్చిపోయేవారు. రాజకీయాల్లో అత్యంత సీనియర్‌ అయిన చంద్రబాబును ఏమాత్రం లెక్కచేయకుండా వ్యక్తిగత విమర్శలు చేసేవారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కి అప్పట్లో అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించారు. కౌరవ సభలో తాను ఉండలేనని గౌరవ సభలో సీఎంగా తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు. సీన్‌ కట్‌ చేస్తే.. అన్నట్లుగానే తిరిగి ఇప్పుడు సీఎంగానే చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో మట్టి కరిపించడమే కాకుండా కనీసం విపక్ష హోదా కూడా లేకుండా చేసేసిన చంద్రబాబు ఇవాళ విజయగర్వంతో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. గతంలో తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి దాదాపు రెండున్నరేళ్ల పాటు అసెంబ్లీకి రాకుండా ఉండిపోయిన చంద్రబాబు.. ఇవాళ సీఎంగా తిరిగి అడుగుపెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

అప్పట్లో అసెంబ్లీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల హేళనలను భరించి, భరించి చివరికి బహిష్కరణ చేసి వెళ్లిపోయిన చంద్రబాబు తిరిగి శాసనసభకు సీఎంగా అడుగుపెడతారా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే అప్పటికి పవన్‌ కళ్యాణ్‌ తో కానీ, బీజేపీతో కానీ పొత్తు లేదు. అలాగే జనసేన–బీజేపీ పొత్తు కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు తోటి విపక్షాలతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా చాలా విషయాల్లో వెనక్కి తగ్గారు. ఈ మంత్రం ఫలించి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు అన్నట్లుగానే శపథం నెరవేర్చుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ANN TOP 10