AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి పోచారం

సీఎం రేవంత్‌ సమక్షంలో హస్తం గూటికి
కుమారుడు పోచారం భాస్కర్‌రెడ్డి సైతం అదే దారిలో..
తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలు
త్వరలో 20 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరిక

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ జోరందుకుంది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ‘హస్తం’బాట పడుతున్నారు. శుక్రవారం తాజాగా మాజీ స్పీకర్, బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్‌రెడ్డి సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పోచారం మెడలో హస్తం కండువా కప్పి సీఎం వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులను చూసి ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే పోచారం కాంగ్రెస్‌లోకి వస్తుండటంతో స్వయంగా సీఎం రేవంత్‌ రెడ్డి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కూడా ఉన్నారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

కీలక బాధ్యతలు..
కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి త్వరలో కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వంపై పోచారం కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. గతంలో అసెంబ్లీ స్పీకర్‌ గా పనిచేసిన అనుభవం.. బాన్స్‌వాడ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అనుభవం పాలన వ్యవహారాల్లో ఉపయోగపడుతోందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. చంద్రబాబు, కేసీఆర్‌ హయాంలో మంత్రిగా వ్వవహరించారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ బీ ఫామ్‌ మీద గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్‌(భద్రాచలం), కడియం శ్రీహరి(స్టేషన్‌ ఘనపూర్‌), దానం నాగేందర్‌(ఖైరతాబాద్‌) కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు.

త్వరలో మరో ఇరవై మంది: దానం
కాగా పోచారం రాకపై దానం నాగేందర్‌ క్లారిటీ ఇచ్చారు. త్వరలో 20 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని చెప్పారు. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్, కేటీఆర్‌ తప్ప ఎవరూ మిగలరని అన్నారు. కేసీఆర్‌ విధానాలే బీఆర్‌ఎస్‌ పార్టీని ముంచాయన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అందరూ హస్తం గూటికి చేరుకుంటుందని తెలిపారు. మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని దానం నాగేందర్‌ అన్నారు.

ANN TOP 10