AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చిటికేస్తే 25 మంది ఎమ్మెల్యేలు మాతో వస్తారు: మంత్రి కోమటిరెడ్డి

బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పనికి రానోడని, పదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీకి ఫ్లోర్‌గా ఉన్నావంటే ప్రస్తుత పరిస్థితులను పార్టీ దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు. మరోవైపు కేసీఆర్ ఉంటడో పోతాడో తెలియదన్నారు. కేసీఆర్ మోకాళ్ల మీద పాదయాత్ర చేసిన కూడా భువనగిరి, నల్గొండలో డిపాజిట్ రాదని చెప్పారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ కూడా దొరకదన్నారు. త్వరలో తండ్రీకొడుకులు కూడా జైలుకెళ్లడం ఖాయమని కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిందని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని మంత్రి ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని భ్రస్టు పట్టించిన సీఎం కేసీఆర్, మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను బ్రస్టు పట్టించిన సంస్కారహీనుడు జగదీష్ రెడ్డి గురించి ఇక మాట్లాడనని, నా స్థాయిని దిగదార్చుకోనని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత నల్లగొండ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటిని వేగవంతం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన నల్లగొండ నియోజక వర్గాన్ని ఎన్నటికి మరువనని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో తనను గెలిపించిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీతో రఘువీర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.

బస్సు యాత్ర చేయడానికి సిగ్గుండాలే..

ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లను గెలుస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీకి 2 లేదా 3 సీట్లలో గెలుస్తుందని, బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రావడం కష్టంగా ఉందని జోస్యం చెప్పారు. మెదక్‌లో బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పరిమితమని చెప్పుకొచ్చారు. దమ్ముంటే బీఆర్ఎస్ మెదక్‌లో గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. బస్సు యాత్ర చేయడానికి కేసీఆర్‌కు సిగ్గు ఉండాలని ఘాటు విమర్శించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి నల్గొండ జిల్లాను పూర్తిగా నాశనం చేశారని విమర్శించారు. నీటీ వాటాల విషయంలో కేసీఆర్, జగన్‌తో లాలూచీ పడ్డారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ వల్లే నల్లగొండ జిల్లాలో కరువు తాండవం చేస్తుందని అన్నారు. మళ్లీ మిర్యాలగూడకు కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ శకం ముగిసిందని, ఆ పార్టీని పట్టించుకునే నాథుడే లేడని అన్నారు. తాము చిటికేస్తే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ANN TOP 10