AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీకి కారణం కేటీఆరే..

కామారెడ్డి: తెలంగాణ తెచ్చిన అని కేసీఆర్ అబద్ధం చెప్పినా ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… నోటికొచ్చిన అబద్దాలతో గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజల గుండెలపై తంతున్నారని మండిపడ్డారు. 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్‌పీఎస్సీ లో నమోదు చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్నా నిరుద్యోగుల సమస్యను కేసీఆర్ పరిష్కరించలేదన్నారు. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పోరాడితే 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారని తెలిపారు. రాష్ట్రంలో ఎంసెట్, ఏఈ, సింగరేణి, విద్యుత్ శాఖ, గ్రూప్-1 పేపర్లు లీక్ అయ్యాయని.. రాష్ట్రంలో ఏ పరీక్షలు చూసినా పేపర్ లీకులే అని వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ దొంగలు, పైరవీకారులకు ముందే ప్రశ్నపత్రాలు అందుతున్నాయని టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు.

పేపర్ లీక్ వ్యవహారంలో చిన్న చేపలను బలి చేసి.. చైర్మన్, బోర్డు మెంబర్లు, కేటీఆర్, కేసీఆర్ తప్పించుకుంటున్నారన్నారు. పరీక్షా పేపర్ లీకేజ్‌కు కారణం కేటీఆర్ అని… ఆయనను మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరని ప్రశ్నించారు. బిడ్డ కోసం మంత్రులను ఢిల్లీ కి పంపించిన కేసీఆర్…. పేపర్ లీకేజీపై ఎందుకు సమీక్షించలేదని నిలదీశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్, కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. పేపర్ లీక్ వ్యవహారంపై 22న కాంగ్రెస్ ముఖ్య నేతలమంతా గవర్నర్‌ను కలువనున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు ఏమిటో అమీతుమీ తేల్చుకుంటామన్నారు. నిరుద్యోగుల జీవితాలు ఆగమైతుంటే గవర్నర్ ఎందుకు సమీక్షించడం లేదని అడిగారు. తక్షణమే కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ సభ్యులను రాజీనామా చేయించి.. సిట్టింగ్ జడ్జితో, లేదా సీబీఐతో విచారణ చేయాలన్నారు. పరీక్షల్లో అవకతవకలపై కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. కేసీఆర్ పాలనకు ఇక కాలం చెల్లిందని… దేవుడు కూడా కేసీఆర్ పక్షాన లేడని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10