ప్రజా పాలనే లక్ష్యం..
గత బీఆర్‌ఎస్ పాలకులు ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు
కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు షురూ..
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గురువారం మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు కవితతో గవర్నర్ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ కవితలో గత ప్రభుత్వం తీరును ఎండగడుతూ గవర్నర్ వ్యాఖ్యలు చేశారు.
‘‘ అధికారమున్నదని హద్దు పద్దు లేక.
అన్యాయా మార్గాల నార్జింపబూనిన.
అచ్చి వచ్చే రోజులంతమైనాయి’’ అంటూ గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారు.. ప్రగతిభవనన్ను.. ప్రజాభవన్‌గా అందుబాటులోకి వచ్చింది.. ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం.. ఆరు గ్యారంటీలను అందుబాటులోకి తీసుకుచ్చాం.. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని ఆమె చెప్పుకొచ్చారు. అర్హులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం.. రైతులు మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అములుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు.. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని గవర్నర్ తమిళిసై వెల్లడించారు.
కేసీఆర్ డుమ్మా..
మరోవైపు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొట్టారు. శుక్రవారం ధన్యవాద తీర్మానం చేయడానికి ఆయన హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం.
గవర్నర్ స్పీచ్ హైలైట్స్:
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వ పాలన సాగుతోంది. ప్రజలకు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం వచ్చింది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. దాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 6 గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్నాం. అన్ని గ్యారెంటీలను నిర్ణీత సమయంలో అమలు చేస్తాం త్వరలో మరో రెండు గ్యారెంటీలను అమల్లోకి తెస్తాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తాం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాం. అర్హులకు రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ప్రజాభవన్ ను ప్రజల కోసమే వినియోగిస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాల భర్తీపై దష్టి సారించాం. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ఆదుకుంటాం. ఎంఎస్‌ఎంఈకి కొత్త పాలసీ తీసుకొస్తాం. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. దేశలో ఏఐ క్యాపిటల్ గా హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తాం. టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తాం. కార్బర్ ఉద్ఘారాలను తగ్గిస్తాం. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందిస్తాం. రాష్ట్రంలో 10 నుంచి 12 ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రానికి తమ ప్రభుత్వంలో కొత్తగా రూ. 40 వేల పెట్టుబడులు వచ్చాయి. ప్రజలపై పన్నుల భారం పడకుండా చూస్తాం. గత అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం. అని గవర్నర్ ప్రసంగించారు.









