అధికారం పోయినా కేసీఆర్కు అహంకారం తగ్గలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు(V. Hanumantha Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీహెచ్ మాట్లాడుతూ.. నల్గొండలో కేసీఆర్ భారీ బహిరంగ సభతో ప్రజలలోకి వెళుతున్నారని.. గత పదేళ్లలో కేసీఆర్ ఏనాడైనా ప్రజలలోకి వెళ్లాడా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ ఉంటే ప్రగతిభవన్లో లేదా ఫాంహౌజ్లో ఉండేవారని అన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డలో కేసీఆర్ సర్కారు అవినీతి భాగోతం బయటపడుతుందనే కృష్ణా జలాలపై కేసీఆర్ మాట్లాడుతూ ప్రజల దృష్టిని దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలలో పెరుగుతున్న ఆదరణతో ఓర్వలేక ప్రస్టేషన్తో సీఎం రేవంత్ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎస్ సోమేష్కుమార్ అవినీతి బాగోతంపై దర్యాప్తు జరిపిస్తామని వీహెచ్ అన్నారు.









