10న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. 9వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలు చర్చించి ఆమోదించనున్నారు. 10వ తేదీ శనివారం రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి.
ఏర్పాట్లపై స్పీకర్, చైర్మన్ సమీక్ష
శాసన సభ, శాసన మండలి సమావేశాలు సజావుగా సాగేందుకు ముందస్తుగా అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం సమీక్షించారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ సభల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇవ్వాలని, ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి సమావేశాలు సజావుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు తప్పకుండా ఆఫీసర్ బాక్స్‌లో ఉండేలా చూడాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రొటోకాల్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.









