వీధి కుక్కలు చేసిన దాడిలో ఓ మహిళ అత్యంత దారుణంగా చనిపోయింది. ఒకేసారి 20 కుక్కలు ఆమెపై దాడి చేయడంతో.. మహిళ ఏమీ చేయలేకపోయింది. మహిళపై పడి దారుణంగా పీక్కుతిన్న కుక్కలు చనిపోయే వరకు వదిలిపెట్టలేదు. చనిపోయిన తర్వాత కూడా అవయవాలను ముక్కలు ముక్కలుగా కొరికి తిన్నాయి. ఇంతటి దారుణమైన సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఈ ఒళ్లు గగుర్పొడిచే సంఘటన పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలోని పస్సాన్ కడిమ్ గ్రామంలో జరిగింది. బాధిత మహిళను 32 ఏళ్ల పరిదేవిగా గుర్తించారు. కేవల్ కుమార్.. ఆయన భార్య పరిదేవి పస్సాన్ కడిమ్ గ్రామం బయట ఉన్న ఒక మురికివాడలో జీవిస్తున్నారు. అయితే వారి దగ్గర ఉన్న జంతువుల కోసం గడ్డి తీసుకురావడానికి వారు పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్తూ ఉంటారు. అయితే రోజూ లాగే మంగళవారం సాయంత్రం కూడా పరిదేవి.. గడ్డి తీసుకొచ్చేందుకు పొలాల్లోకి వెళ్లింది. ఆ సమయంలోనే ఒంటరిగా ఉన్న పరిదేవిని చూసిన 20 వీధి కుక్కలు.. ఆమెపై దాడి చేశాయి.
అయితే తనపై దాడి చేసిన వీధి కుక్కల నుంచి తప్పించుకొని బయటపడేందుకు పరిదేవి విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా అవి వదలకపోవడంతో ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది. పరిదేవి చనిపోయినా.. ఆ కుక్కలు మాత్రం ఆమె శరీరాన్ని వదల్లేదు. ఆమె అవయవాలను కొరుక్కు తిన్నాయి. పరిదేవి ఛాతి, తల, చేతులు, కాళ్లు, పుర్రెను కొరికేశాయి. అయితే తన భార్య పశువులకు గడ్డి తీసుకురావడానికి వెళ్లి.. ఎంతకూ రాకపోవడంతో కేవల్ కుమార్.. ఆమెను వెతుక్కుంటూ వెళ్లగా.. అక్కడ ఆమె శవాన్ని చూసి షాక్ అయ్యాడు.
పొలాల్లో తన భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా ఉన్న స్థితిలో చూసి కేవల్ కుమార్ గుండె బద్ధలైంది. అది గమనించిన గ్రామస్తులు.. పరిదేవి మృతదేహాన్ని సుల్తాన్‌పూర్‌లోని ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటనను కపుర్తలా జిల్లా అధికారులు చాలా తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వీధి కుక్కలపై చర్యలు చేపట్టారు.









