ముగిసిన తొలి రోజు ఆట
విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో టీమ్ఇండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్లు నష్టపోయి 336 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (179) ద్విశతకానికి చేరువలో ఉన్నాడు. అతడితో పాటు రవిచంద్రన్ అశ్విన్ (5) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ లు చెరో రెండు వికెట్లు తీశారు. జేమ్స్ అండర్సన్, టామ్ హర్ట్లీ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
యశస్వి జోరు..
మొదటి రోజు ఆటలో యశస్వి జైస్వాల్ ఆటే హైలెట్ గా చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (14) లు తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆరంభం నుంచే యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడగా రోహిత్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిచాడు. అయితే.. అరంగ్రేట బౌలర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఓలి పోప్ క్యాచ్ అందుకోవడంతో కెప్టెన్ పెవిలియన్‌కు చేరుకున్నాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్ (34) గిల్‌తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లాడు. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న గిల్ మంచి టచ్‌లో కనిపించాడు. ఐదు బౌండరీలు బాది ఫామ్ అందుకున్నట్లుగానే కనిపించాడు. అయితే.. జేమ్స్ అండర్స్ బౌలింగ్‌లో బెన్ ఫోక్స్ చేతికి చిక్కాడు. టెస్టుల్లో గిల్‌ను ఔట్ చేయడం అండర్సన్‌కు ఇది ఐదోసారి. గిల్, జైస్వాల్ జోడి రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించారు.
టెస్టుల్లో రెండో శతకం
ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ జైస్వాల్ ఇంగ్లాండ్ బౌలర్ల పై ఎదురుదాడికి దిగాడు. యడా పెడా బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పడిపోకుండా చూశాడు. హాఫ్ సెంచరీని ఫోర్ కొట్టి పూర్తి చేసుకున్న జైస్వాల్ సిక్సర్‌తో సెంచరీని అందుకున్నాడు. జైస్వాల్ కెరీర్‌లో ఇది రెండో సెంచరీ కాగా స్వదేశంలో అతడికి ఇది మొదటిది. అనంతరం మరింత ధాటిగా ఆడిన అతడు 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
శ్రేయస్ అయ్యర్ (27), అరంగ్రేట ఆటగాడు రజత్ పాటిదార్ (32), అక్షర్ పటేల్ (27) ల నుంచి జైస్వాల్‌కు మంచి మద్దతు లభించింది. శ్రేయస్‌తో మూడో వికెట్‌కు 79 పరుగులు, పాటిదార్ తో నాలుగో వికెట్‌కు 70 పరుగులు, అక్షర్ పటేల్‌తో ఐదో వికెట్ కు 52 పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పాడు. కాసేపట్లో తొలి రోజు ముగుస్తుందనగా కేఎస్ భరత్ (17) ఔటైనా రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి మరో వికెట్ పడకుండా మొదటి రోజును ముగించాడు.









