తెలంగాణ కరోనా బులిటెన్ విడుదలైంది. రాష్ట్రంలో 4 కరోనా కేసులు నమోదయ్యాయ. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 9 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇవాళ 402 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా కరోనా సోకిన వారి స్క్వాబ్ నమూనాలను పరీక్షలకు పంపారు వైద్యులు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ పై టెన్షన్ మొదలైంది. కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారుల హెచ్చరించారు. ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా మాస్కులు వాడాలన్నారు.
కరోనా కొత్త వేరియంట్ JN-1 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కొత్త వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. సింగపూర్ లో కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్ లోనూ అదే రీతిలో ప్రబలుతుండటం కంగారు పెడుతోంది. ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో గడిచిన 24 గంటల్లో ఐదుగురు మరణించారు. మరోవైపు కేరళలో గడిచిన 24 గంటల్లో 127 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు సరిపడా ఆర్టీ పీసీఆర్ కిట్లు పంపిణీ చేసి, అనుమానితులకు టెస్టులు చేయాలని సూచించింది.
కేరళలో తొలి కేసు నమోదు..
దేశంలోనే తొలిసారి కేరళలో కరోనా సబ్ వేరియంట్ JN.1 బయటపడింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో అమెరికాలో మొదట దీన్ని గుర్తించారు. 38కి పైగా దేశాలకు ఈ వేరియంట్ విస్తరించింది. దీని వల్లే మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని నిపుణులు తెలిపారు. ఇక, ఇది సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు, తల, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని, మనిషి రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని హెచ్చరించారు.









