తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఈ దఫా రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్న విషయం మనకు తెలిసిందే. తాను పోటీ చేయనున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్ పత్రాలకు కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు. గజ్వేల్‌లో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి కేసీఆర్ సమర్పించనున్నారు. సీఎం నామినేషన్ సందర్భంగా గజ్వేల్‌లో ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఇప్పటికే గజ్వేల్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించడంతో ఎటువంటి ఆర్భాటం లేకుండా నామినేషన్ ఘట్టం ఉంటుందని హరీష్ రావు వెల్లడించారు. పెద్దవాళ్లపై పోటీ చేస్తే పెద్దవాళ్లైపోతామనే భావనతో కొందరు గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారని హరీష్ రావు అన్నారు.
లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో కేసీఆర్ గజ్వేల్‌లో విజయం సాధిస్తారని హరీష్ రావు అన్నారు. ఎప్పుడెప్పుడు ఓటు వేసి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని గజ్వేల్ ఓటర్లు తహలాడుతున్నారని అన్నారు. ఎంత మంది డీకేలు, పీకేలు వచ్చినా తెలంగాణ ఏకే47 కేసీఆర్‌కు ఏమి కాదని తెలిపారు. గజ్వేల్‌లో నామినేషన్ తర్వాత అక్కడి నుంచి కేసీఆర్ నేరుగా కామారెడ్డి వెళ్తారు. అక్కడ నామినేషన్ సమర్పించిన తర్వాత బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. ప్రచారం చివరి రోజు గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ సభ ఉంటుంది. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్‌లోనే చివరి సభ నిర్వహించి ప్రచారానికి కేసీఆర్ ముగింపు పలికారు. అదే సెంటిమెంట్‌ను ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ అనుసరించబోతున్నట్లు ప్రకటించారు.









