చట్టానికి ఎవరూ అతీతులు కారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపాటు
హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు కేంద్ర కక్ష సాధింపు చర్యలో భాగమే అంటూ బీఆర్‌ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. కవితకు ఈడీ నోటీసులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ బిడ్డ కవిత తెలంగాణ పరువు తీశారన్నారు. మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని విమర్శలు గుప్పించారు. సీబీఐ, ఈడీతో బీజేపీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేయకుంటే కవిత తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఎవరు అవినీతి చేసినా.. చట్టానికి అతీతులు కాదన్నారు. కవిత లిక్కర్ కుంభకోణాన్ని తెలంగాణ సమాజానికి ముడి పెట్టడం ఏంటని ప్రశ్నించారు. గతంలో ఎంతో మందిని విచారణ సంస్థలు విచారించాయని… కవిత కొత్తేం కాదని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ మంత్రుల విమర్శలు…
కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన ఈడీ.. 9న విచారణకు రావాల్సిందిగా పేర్కొంది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల నేపథ్యంలో విచారణకు సమయం కావాలని ఈడీని కవిత కోరారు. అయితే కవితకు ఈడీ నోటీసులపై తెలంగాణ మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మహిళా దినోత్సవం రోజే కవితకు నోటీసులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం కక్ష పూరిత ధోరణిని తెలియజేస్తోందని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్రం విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులతో లొగందీసుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై మరింతగా పోరాడుతామని మంత్రులు స్పష్టం చేశారు.