బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవటం అన్యాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క సభ్యుడన్న లోక్ సత్తాను కూడా బీఏసీకి పిలిచేవారని గుర్తుచేశారు. సమైక్య పాలకులకు ఉన్న సోయి… తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు సభ్యులున్న బీజేపీకి బీఏసీకి ఆహ్వానం లేదన్నారు. గతంలో శాసనసభ ఆవరణలో అన్ని పార్టీలకు ఆఫీసుల కోసం గదులు ఉండేవని.. ప్రస్తుతం మాకు శాసనసభాపక్షం కార్యాలయాలు ఇవ్వలేదని తెలిపారు.
ఇది అత్యంత అవమానకర చర్య అని వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం స్పీకర్‌కు ఫోన్ చేసి.. తాము ఎక్కడుండాలని అడిగితే స్పందన లేదన్నారు. నిజాం క్లబ్‌లో కూర్చొని సమావేశాలకు రావాల్సి వచ్చిందన్నారు. మూడు రోజులు మాత్రమే సభను జరపటం సిగ్గుచేటన్నారు. 6 నెలలకు ఒకసారి సభ జరగాలి కాబట్టి నిర్వహిస్తున్నారు తప్ప.. ప్రభుత్వానికి ప్రజా సమస్యలు చర్చించాలన్న సోయి లేదని విమర్శించారు. వరదలతో లక్షల ఎకరాల పంట పొలాలు మునిగిపోయాయని…ప్రజలు, పశువులు కొట్టుకుపోయాయని తెలిపారు. ప్రభుత్వం కనీసం బాధితులకు నిత్యావసర సరుకులు ఇవ్వలేదని ఎమ్మెల్యే విమర్శించారు.









