సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు భేటీ అయ్యారు. త్వరలో జూపల్లి కాంగ్రెస్‌లో చేరనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఉదయం భట్టి నివాసానికి చేరుకున్న ఆయన… కొద్దిసేపు సీఎల్పీ నేతతో ముచ్చటించారు. పాదయాత్ర విజయవంతపై భట్టికి జూపల్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జూపల్లి మీడియాతో మాట్లాడుతూ… కొల్లాపూర్‌లో జరగబోయే బహిరంగ సభకు రావాలని భట్టిని కోరినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై అనేక విషయాలు యాత్రలో తెలుసుకున్నట్లు భట్టి చెప్పారన్నారు. నిన్న (ఆదివారం) మహబూబ్ నగర్ జిల్లా నేతలంతా కలిసి మాట్లాడుకున్నట్లు తెలిపారు. సభకు జాతీయ నేతలు రాబోతున్నారన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి నేతల చేరికలు ఉంటాయన్నారు. కూచుకుల్లా దామోదర్ రెడ్డి ఆయన కుమారుడు, మేఘా రెడ్డితో పాటు చాలామంది నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
జూపల్లి కాంగ్రెస్‌లో చేరుతున్నందుకు ధన్యవాదాలు అని భట్టి అన్నారు. జూపల్లి చేరిక పార్టీకి, రాష్ట్రానికి ఉపయోగపడుతుందన్నారు. చేరిక సమయంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని.. సభ ద్వారా తెలంగాణ సమాజానికి ఓ మెసేజ్ వెళ్లనుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నేతలు క్యాడర్ కదిలిరావాలని పిలుపునిచ్చారు. పాలమూరు సభ డేట్, ప్రియాంక గాంధీ షెడ్యూల్‌ను ఏఐసీసీ పెద్దలు ప్రకటిస్తారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.









