AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉత్తరాది వర్ష బీభత్సానికి కారణం ఇదేనట.. ఐఎండీ ఏం చెబుతుందంటే..

ఉత్తర భారతం చిగురుటాకులా వణుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ సహా ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు దెబ్బతిని, పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. యమున సహా పలు ప్రధాన నదులు ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో వరద పోటెత్తి పలు ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. హరియాణా ప్రభుత్వం యమునా నదిలోకి లక్ష క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టడంతో ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉందని సీడబ్ల్యూసీ హెచ్చరించింది.

వర్షాల కారణంగా ఇప్పటి వరకూ 22 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీర్ లో 17.. యూపీ, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఐదు మరణాలు నమోదయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. అయితే, ఈ భారీ వర్షాలకు పశ్చిమ ప్రాంతం మీదుగా వీచే గాలులు, రుతుపవనాల కలయికే కారణమని ఐఎండీ పేర్కొంది. జులై మొదటి వారంలో వాయువ్య భారతదేశంలో కురిసిన వర్షపాతం మొత్తం దేశానికి లోటును భర్తీ చేసిందని ఐఎండీ తెలిపింది. జులైలో ఇప్పటి వరకూ 243.2 మి.మీ వర్షపాతం నమోదుకాగా.. ఇది సాధారణం కంటే 239.1 మిమీ కంటే రెండు శాతం ఎక్కువని ఐఎండీ పేర్కొంది.

ANN TOP 10