వరంగల్: కేసీఆర్ ప్రభుత్వ తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం అని.. ఇప్పుడు వారి అవినీతి ఢిల్లీకి కూడా పాకిందని ప్రధాని మోడీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్‌ఎస్ ప్రభుత్వ పని, వారికి పొద్దున లేస్తే అదే పని అని మండిపడ్డారు. కుటుంబాన్ని పెంచిపోషించడమే కేసీఆర్ సర్కార్ పని అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం స్కామ్‌ల్లో ఇరుక్కుందని , కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటిని వెలికితీసే పనిలో పడ్డాయని అన్నారు.
వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ‘భద్రాకాళీ అమ్మవారి మహత్యానికి, సమక్క-సారలమ్మ పౌరుషానికి, రాణి రుద్రమ పరాక్రమానికి ప్రఖ్యాతి గాంచిన వరంగల్‌కి రావడం సంతోషంగా ఉంది’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
ప్రధాని మాట్లాడుతూ తెలంగాణ జనం ఒక కుటుంబం కబంధ హస్తాల్లో చిక్కుకుందన్నారు. రసత్వ పార్టీలంటేనే అవినీతిమయం. తెలంగాణకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ప్రమాదమేనని అన్నారు. తెలంగాణ నుంచి ఆ రెండు పార్టీలనూ తరిమికొట్టాలి. 9ఏళ్లుగా తెలంగాణ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోందన్నారు. వేల సంఖ్యలో టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ స్కామ్ అందరికీ తెలుసన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ళు కూడా కట్టించి ఇవ్వలేకపోయారని మోదీ మండిపడ్డారు. రైతులకు చేస్తానన్న రుణమాఫీ ఊసే లేదని, తెలంగాణ ప్రభుత్వంపై సర్పంచ్‌లంతా ఆగ్రహంతో ఉన్నారు. ఇక్కడి గ్రామపంచాయితీలకు కేంద్రం రూ.వేలకోట్లు ఇచ్చిందని అన్నారు.









