తాను ఏనాడూ పదవులను కోరలేదని, పార్టీ ఆదేశాలను పాటిస్తూ 1980 నాటి నుంచి సైకికుడిలా పనిచేస్తున్నానని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలను రెండో సారి అందుకున్న నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా 2 సార్లు, తెలంగాణ బీజేపీ తొలి అధ్యక్షుడిగా పనిచేశానని, 4వ సారి మళ్లీ పార్టీ బాధ్యతను జేపీ నడ్డా నేతృత్వంలోని బీజేపీ పెట్టిందన్నారు. మంగళవారం తాను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి విషయం తెలిపారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తానని పేర్కొన్నారు.
ఇంకా దక్షిణ భారతదేశంలో పార్టీని పటిష్ఠం చేయడంపై సమిష్టి ప్రణాళిక తయారుచేసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ రోజు సాయంత్రం తాను, బండి సంజయ్ కలిసి హైదరాబాద్‌కి చేరుకుంటామని, ఈ రోజు రాత్రి తెలంగాణ బీజేపీలోని ముఖ్య నేతలను కలిసి మాట్లాడతానని చెప్పారు. ప్రధాని వరంగల్ పర్యటనకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని, ఈ విషయంలో పార్టీలోని నాయకులంతా సహకరించాలని కోరారు. ప్రధాని తన వరంగల్ పర్యటనలో భాగంగా రైల్ వ్యాగన్ తయారీ కేంద్రానికి భూమిపూజ చేస్తారని, 150 ఎకరాల స్థలంలో ఈ పరిశ్రమ రానుందని, రైల్వే ఓవర్ హాలింగ్ యూనిట్ అని తొలుత అనుకున్నాం కానీ ప్రధాని వ్యాగన్ యూనిట్ పెట్టడానికి ఓకే చెప్పారని తెలిపారు. వరంగల్‌ను రైల్వే తయారీ హబ్‌గా తయారు చేయబోతున్నామని, తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద వర్క్ షాప్, తయారీ యూనిట్ రావడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు.
అలాగే ప్రధాని నూతన జాతీయ రహదారులకు భూమిపూజ చేస్తారని, వరంగల్ ఎయిర్ స్ట్రిప్ ద్వారా నేరుగా హెలికాప్టర్‌లో అక్కడికి వచ్చి, భద్రకాళి దర్శనం చేసుకుంటారని, అనంతరం రైల్వే యూనిట్‌ను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తారని, ఆర్ట్స్ కాలేజి గ్రౌండ్‌లో బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, జూలై 9న దక్షిణ భారత రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతల సమావేశం హైదరాబాద్‌లో జరుగుతుందని పేర్కొన్నారు.









