AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అదానీ అంశంపై మోదీ మాట్లాడరేం?

మోదీ కంటే మన్మోహన్‌ సింగ్‌ సర్కారే బెటర్‌
అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం

హైదరాబాద్‌: అదానీ అంశంపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతున్నా ప్రధాని మోదీ ఏమీ మాట్లాడకపోవడం దారుణమని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతకుముందు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ చాలా మంచి పనితనాన్ని చూపించారని ప్రశంసించారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా చూపించారు సీఎం కేసీఆర్‌. అదానీ వ్యవహారంపై స్పందిస్తూ.. ప్రముఖ వారపత్రిక ది ఎకానమిస్ట్‌ ప్రచురించిన కథనాన్ని కేసీఆర్‌ ఉటంకించారు. అదానీ రూపంలో వచ్చిన ఉపద్రవం నుంచి భారతదేశం ఎలా బయటపడబోతోందన్న ఆ వారపత్రిక ప్రశ్నించిందన్నారు. అయితే.. ఈ విషయంపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మాట్లాడాల్సిన అవసరం ఉండేదని.. కానీ.. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని మండిపడ్డారు. అసలు విషయం పక్కన పెట్టి.. పార్టీ నేతలు విమర్శించుకోవటం ఆందోళన కలిగించే విషయమని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ కంటే.. మన్మోహన్‌ సింగ్‌ చాలా మెరుగైన పనితనం చూపించారని కేసీఆర్‌ పేర్కొన్నారు. అయితే… మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో చాలా పనులు చేశారని.. కానీ బయటకు చెప్పుకోలేదని వివరించారు. కానీ.. బీజేపీ పార్టీ మాత్రం మన్మోహన్‌ సింగ్‌ ఏమీ చేయలేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి.. ఆయన మీద బదనాం పెట్టారంటూ చెప్పుకొచ్చారు. అయితే.. ఈ విషయాన్ని తాను చెప్పటం కాదని.. ఎంతో మంది మేధావులు చెప్పారని వివరించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేయట్లేదని దేశ ప్రజలను నమ్మించి 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఫలితంగా.. మోదీ గెలిచారు.. భారతదేశ ప్రజలు ఓడిపోయారని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ జీఎస్డీపీ 13 లక్షల కోట్లకు పై చిలుకు.. అయితే.. ప్రధాని స్థానంలో మన్మోహన్‌ సింగ్‌ ఉన్నా.. మన రాష్ట్ర జీఎస్టీపీ 16 లక్షల కోట్లు ఉండేది. అంటే.. ఒక తెలంగాణ రాష్ట్రమే.. 3 లక్షల కోట్లు నష్టపోయింది. దేశంలోని ప్రతి సెక్టార్‌ నష్టపోయింది. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో 14 శాతం అప్పులు తగ్గించారు. మోదీ పాలనలో 54 శాతం అప్పులు పెరిగాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూపాయి పతనమైంది.’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటానన్న కేసీఆర్‌.. తాను చెప్పిన మాటల్లో ఒక్కటి అబద్ధమైనా.. రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10