AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హరిహరకృష్ణ కేసులో ఊహించని ట్విస్ట్‌.. 

రంగారెడ్డి: స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురైన అబ్దుల్లాపూర్‌మెట్‌ నవీన్‌ హత్య కేసులో ఊహించని ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. నవీన్‌ను హత్య చేసిన అతని స్నేహితుడు హరిహరకష్ణ మూసారంబాగ్‌లో అక్క, బావలతో నివాసం ఉంటున్నాడు. నవీన్‌ను హత్య చేసిన తరువాత హరిహరకృష్ణ ఇంటికి రాకపోవడంతో అతని అక్కాబావా కంగారుపడ్డారు. అతని స్నేహితులకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. ఎవరూ తమ వద్దకు రాలేదని చెప్పడంతో మలక్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిబ్రవరి 23న హరిహరకష్ణ కనిపించడం లేదని అక్కాబావా ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. హరిహరకష్ణ కనిపించడం లేదని హరిహరకష్ణ బావ లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజే అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో హరిహరకృష్ణ లొంగిపోవడం గమనార్హం.

పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా చారుకొండ మండలం శిరిసనగండ్లకు చెందిన నేనావత్‌ నవీన్‌ (22)కు దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా ప్రేరాల హరిహరకృష్ణతో పరిచయమైంది. మంచి స్నేహితులయ్యారు. తొలుత నవీన్‌ కు సమీప కళాశాలలో చదివే యువతితో పరిచయమై.. అది ప్రేమగా మారింది. ఈ విషయం హరిహర కష్ణకూ తెలుసు. నవీన్‌ బీటెక్‌  కోసం నల్లగొండలోని ఎంజీఎం కళాశాలలో , హరి పీర్జాదిగూడలోని కళాశాలలో చేరారు. నవీన్‌ నల్లగొండకు వెళ్లాక యువతితో దూరం పెరిగింది. ఇదే అదునుగా యువతితో హరి స్నేహం పెంచుకుని, ప్రేమించాడు. ఇది తెలిశాక నవీన్‌ కూడా ఆమెకు టచ్‌లోకి వచ్చాడు. దీన్ని తట్టుకోలేని హరి యువతిని దక్కించుకోవాలని, నవీన్‌ ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. నవీన్‌ హత్యకు 3 నెలలుగా హత్యకు పథకం వేస్తున్నాడు. షాపింగ్‌ మాల్‌లో కత్తిని కొన్నాడు.

పార్టీ చేసుకుందామని పిలిచి..

నార్కట్‌పల్లిలో ఉంటున్న నవీన్‌ ను పార్టీ చేసుకుందామని హరి హైదరాబాద్‌కు పిలిచాడు. ఈ నెల 17న ఇద్దరూ పెద్ద అంబర్‌పేట్‌ వద్ద మద్యం తాగారు. బైక్‌పై అబ్దుల్లాపూర్‌మెట్‌ వైపు వచ్చి.. మధ్యలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో యువతితో ప్రేమ వ్యవహారమై గొడవపడ్డారు. కిందపడిన నవీన్‌ను గొంతు పిసికి.. పదునైన కత్తితో హరి విచక్షణా రహితంగా దాడి చేశాడు. మర్మాంగాన్ని కోసేశాడు. చేతి వేళ్లను నరికేశాడు. మొండెంను వేరు చేశాడు. కడుపులో పేగులను బయటకు తీశాడు. ఉన్మాదిగా మారిన హరి.. నవీన్‌ దుస్తులు తొలగించి, చేతులకు గ్లోవ్స్‌ ధరించి శరీర భాగాలను కోసేశాడు. అతడి సెల్‌ఫోన్‌ను పగులకొట్టాడు. హత్య దృశ్యాలను, అతడి గుండె, మర్మాంగాలను ఫొటో తీసి యువతికి, కొందరు స్నేహితులకు హరి వాట్సాప్‌ చేశాడు. గుండెను బయటకు తీసిన తీరు వైద్యులను సైతం నివ్వెరపరిచింది. ఏ అవయవాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపుతారో వాటినే ధ్వంసం చేసినట్లు వారు పేర్కొనడం గమనార్హం. క్రై మ్‌ సిరీస్‌లు, యూట్యూబ్‌ చూసి హత్యకు పక్కా ప్లాన్‌ వేశాడని, పూర్తి అవగాహనతోనే హరి దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు, వైద్యులు అనుమానిస్తున్నారు.

అన్నం తీసి పెట్టు: నవీన్‌ ఆఖరి ఫోన్‌

ఈ నెల 17న హైదరాబాద్‌కు వచ్చిన నవీన్‌రాత్రి 8 గంటలకు హాస్టల్‌ స్నేహితుడు ప్రదీప్‌కు ఫోన్‌ చేశాడు. ‘రావడానికి ఆలస్యం అవుతుంది. అన్నం తీసి పెట్టు’ అని చెప్పాడు. ఎంతకూ రాకపోవడంతో 9.30కు ప్రదీప్‌ ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. తర్వాతి రోజు నవీన్‌ స్నేహితులు హరికి ఫోన్‌ చేయగా నిన్ననే అబ్దుల్లాపూర్‌మెట్‌లో వదిలేసి వెళ్లినట్లు తెలిపాడు. కాగా, ఈ విషయాన్ని స్నేహితులు నవీన్‌ తండ్రి శంకరయ్యకు చెప్పి హరిహరకష్ణ ఫోన్‌ నంబర్‌ ఇచ్చారు. శంకరయ్య మాట్లాడినా హరి అదే సమాధానం చెప్పాడు. నవీన్‌ కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు తాను కూడా పోలీస్‌ స్టేషన్‌కు వస్తానని సలహా కూడా ఇవ్వడం గమనార్హం. మరోవైపు గత మంగళవారం హరికి శంకరయ్య ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ వచ్చింది. దీంతో వెంటనే నార్కట్‌పల్లికి వెళ్లి మిస్సింగ్‌ కేసు పెట్టారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నవీన్‌ కుటుంబ సభ్యులు కేసులు పెట్టడం, పోలీసులు విచారణ వేగిరం చేయడంతో పట్టుబడతానని భావించిన హరి శుక్రవారం సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్‌ స్టేషన్‌ లో లొంగిపోయాడు. నవీన్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10