శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. సుడాన్ నుంచి వచ్చిన 23 మంది వద్ద 14.906 కిలోల బంగారాన్ని కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.7.90 కోట్ల విలువ ఉంటుందని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో 14.415 కిలోలు 23 క్యారెట్ల బంగారం ఉండగా.. 0.491 కిలోల 24 క్యారెట్ల గోల్డ్ ఉన్నట్లు స్పష్టం చేశారు.
ప్రయాణికులతో పాటు లగేజీ, బూట్లలోని చిన్న చిన్న రంధ్రాలు, బట్టల మడతల్లో ఈ బంగారాన్ని గుర్తించినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. పట్టుబడి బంగారం పరిమాణం ఆధారంగా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుబడి బంగారం మొత్తాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో పట్టుబడ్డ బంగారంలో ఇదే అతిపెద్ద మొత్తమని కస్టమ్స్ అధికారులు చెప్పారు.
‘షార్జా నుంచి వచ్చిన విమానంలో ప్రయాణికుల కదలికలపై అనుమానం వచ్చింది వెంటనే వారిని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా స్కానింగ్ చేశాం. షూలు, టైలు, బ్యాగులు, బెల్ట్లలో దాచిపెట్టి అక్రమంగా బంగారాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.