కలెక్టర్‌కు యువకుడి ఫిర్యాదు
జగిత్యాల : కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదంటూ ఓ యువకుడు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చాడు. ఈ ఆసక్తికర సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల పట్టణంలోని వైన్స్ షాప్స్, బార్లలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని భీరం రాజేష్ అనే యువకుడు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు లిఖితపూర్వకంగా ఒక వినతిపత్రం కూడా కలెక్టర్‌కు అందజేశాడు. దీంతో అక్కడ ఉన్నవారందరూ ఇది చూసి ఆశ్చర్యపోయారు.
ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. అందులో భాగంగా సోమవారం జగిత్యాలకు చెందిన భీరం రాజేష్ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాడు. జగిత్యాలలో కేఎఫ్ బీర్లు దొరకడం లేదని, అక్కడ తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో దొరుకుతున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నాడు. కేఎఫ్ బీర్ల కోసం 20 నుండి 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందాడు.
బెల్ట్ షాప్‌లలో ఎక్కువ రేట్లకు కింగ్ ఫిషర్ బీర్లు అమ్ముతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని భీరం రాజేష్ డిమాండ్ చేశాడు. జగిత్యాల పట్టణంలో ఉన్న అన్ని వైన్స్ షాప్స్, బార్లలో అన్ని రకాల బీర్లు లభించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. వైన్ షాపులలో నాసిరకమైన బీర్లు అమ్ముతున్నారని, దీని వల్ల మందుబాబుల ఆరోగ్యం పాడవుతుందని చెప్పాడు. వైన్ షాపులలో దొరక్కుండా బెల్టు షాపులలో బీర్లు దొరుకుతున్నాయని, బెల్టు షాపులలో దొరికేవి ఒరిజినలా? లేదా నకిలీవా? అనేది అర్ధం కావడం లేదన్నాడు.
మద్యం షాపులలో కేఎఫ్ బీర్లు అమ్మకపోవడం, బెల్టు షాపులతో లభించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతుందని భీరం రాజేష్ ఆరోపించాడు. అన్ని రకాల బీర్లు అమ్ముతామని చెప్పి వైన్ షాపులకు అనుమతి పొందిన తర్వాత.. అన్ని బ్రాండ్ల బీర్లను ఎందుకు విక్రయించడం లేదని ప్రశ్నించాడు. ప్రస్తుతం అతడి వినతిపత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మందుబాబుల తరపున తన వాణి వినిపించాడని కొంతమంది సెటైర్లు వేస్తున్నారు.