తెలంగాణ బీజేపీ నాయకులు గత కొన్ని రోజులుగా అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నాడని, ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసి జూన్ లేదా జూలైలో ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతో ఉన్నాడు అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. శనివారం నిజామాబాద్ పర్యటనలో భాగంగా మీడియా తో మాట్లాడిన కేటీఆర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్లమెంట్ ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వస్తే రాష్ట్రంలో తాము కూడా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతామని కేటీఆర్ ప్రకటించాడు. కేంద్రంలో పార్లమెంట్ ని రద్దు చేసే దమ్ము బీజేపీ కి ఉందా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న కేంద్రం విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేక పోయిందన్నారు. తెలంగాణకు పైసా అదనంగా ఇవ్వలేదని ఆ సందర్భంగా బీజేపీ నాయకత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ లో ప్రభుత్వం పూర్తి కాలం ఉంటుంది అన్నట్లుగా కేటీఆర్ స్పష్టం చేశారు.