నమ్మకంగానే ఉంటూనే నట్టేట ముంచిన డ్రైవర్
హైదరాబాద్: నమ్మకంగానే ఉంటూ నట్టేట ముంచాడు ఓ ప్రబుద్ధుడు. ఏకంగా రూ. 7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మాదాపూర్‌లో నివాసం ఉంటున్న రాధిక ఆభరణాల వ్యాపారం చేస్తుంటారు. రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి రాధిక వద్ద రెండు నెలల క్రితం డ్రైవర్‌గా కుదిరాడు. నమ్మకంగా పనిచేస్తూ కొద్దిరోజుల్లోనే.. ఇంట్లో మనిషిలా కలిసిపోయాడు.
అయితే భుజ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న అనూష రూ.50 లక్షల విలువచేసే ఆభరణాలను రాధిక వద్ద ఆర్డర్ చేశారు. అనూష ఓ శుభకార్యం నిమిత్తం.. శుక్రవారం సాయంత్రం మధురానగర్‌లో బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే తాను ఆర్డరు చేసిన నగలను అక్కడికే పంపాలని అనూష రాధికను కోరింది. దీంతో రాధిక తన కారులో డ్రైవర్ శ్రీనివాస్, సేల్స్‌మెన్ అక్షయ్‌లతో నగలను పంపించారు. మధురానగర్‌కు చేరుకున్నాక డ్రైవర్ శ్రీనివాస్ కారులోనే ఉండగా.. అక్షయ్ ఇంట్లోకి వెళ్లి నగలను అనూషకు ఇచ్చి వెనుదిరిగి వచ్చాడు.
బయటకు వచ్చి చూడగా.. కారుతో పాటు శ్రీనివాస్ పంపించలేదు. అతడికి కాల్ చేసినా స్పందన లేదు. అయితే కారులో సిరిగిరిరాజ్ జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్‌కు తిరిగి ఇవ్వాల్సిన రూ.7 కోట్ల వజ్రాభరణాలు ఉన్నాయి. ఆందోళనకు గురైన అక్షయ్ వెంటనే విషయాన్ని రాధికకు తెలియజేశాడు. బంగారు ఆభరణాలు, కారుతో పాటు డ్రైవర్ శ్రీనివాస్ పారిపోయాడంటూ రాధిక ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ను ఆధారం గా చేసుకుని దర్యాప్తు కొనగిస్తున్నారు. ప్రత్యేకంగా ఏడు బృందాలను రంగంలోకి దించిన పోలీసులు.. శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.