జమ్మలమడుగు ఎమ్మెల్యే బరిలో దిగేందుకు వ్యూహం
ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. కేంద్రంపై పోరాడేందుకు వైఎస్ జగన్ కు అవకాశమిచ్చిన ప్రజలకు వైసీపీ ఈసారి ఏం సమాధానం చెప్పబోతోందన్నది కీలకంగా మారింది. అదే సమయంలో ఒకప్పుడు యూపీఏ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళ్లి సోనియా వంటి నేతల్ని ఎదుర్కొన్న జగన్ ధైర్యం ఇప్పుడేమైందన్న ప్రశ్నలూ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రేపు మోడీపై పోరాడాల్సిన పరిస్ధితులే ఎదురైతే జగన్ ఏం చేయబోతున్నారన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. వీటి మధ్య జగన్ ముందుజాగ్రత్తగా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
కడపలో జగన్ రాజకీయం
వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడపలో పరిస్ధితులు ఇప్పటివరకైతే జగన్ అదుపులోనే ఉన్నాయి. అయితే వివేకా హత్య పై సీబీఐ చేస్తున్న విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా పులివెందులతో పాటు వైఎస్సార్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్ని కంచుకోటలుగా మార్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా పూర్తిగా అన్ని నియోజకవర్గాలపై పట్టు చిక్కడం లేదు. దీనికి ఓ బలమైన కారణముంది. వైఎస్ కుటుంబం వేరు, వైసీపీ నిలబెట్టిన ఎమ్మెల్యేలు వేరు. ఈ రెండిరటికీ మధ్య ఉన్న వైరుధ్యం వైసీపీని కలవరపెడుతోంది. దీంతో వైసీపీ వ్యూహాలూ మారిపోతున్నాయి. ఇప్పటికే పులివెందులలో జగన్, కమలాపురంలో ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. దీంతో మిగిలిన నియోజకవర్గాలపై వైసీపీ దృష్టిసారిస్తోంది.
జమ్మలమడుగుపై జగన్ ఫోకస్
వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి చాలా ప్రతిష్టాత్మకమైంది. కడప స్టీల్ ప్లాంట్ ను జగన్ ఇక్కడే పెట్టిస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి వైఎస్ కుటుంబం మద్దతిచ్చిన అభ్యర్ధులు గెలిచినా మధ్యలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో దేవగుడి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య కక్షలూ పెరిగాయి. ఈ పరిణామాల మధ్యే 2019లో వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ సుధీర్ రెడ్డి గెలిచారు. అయినా జమ్మలమడుగుపై వైసీపీ పూర్తి ఆధిపత్యం రావడం లేదు. ఈసారి టీడీపీ అభ్యర్ధిగా ఆదినారాయణరెడ్డి నిలిచే అవకాశం ఉందన్న అంచనాలు, మరోవైపు వైసీపీలోనే ఉన్న రామసుబ్బారెడ్డి నుంచి ఎదురయ్యే ప్రతిఘటన జగన్ ను ఆలోచనలో పడేస్తున్నాయి. దీంతో రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ సీటిచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు.
బరిలో వైఎస్ భారతి?
జమ్మలమడుగుపై పూర్తి ఆధిపత్యం సాధించక తప్పని పరిస్ధితి వైఎస్ జగన్ కు ఎదురవుతోంది. గతంలో వైసీపీ పలుమార్లు గెలిచిన ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపైనా వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో ఆయన స్ధానంలో ఈసారి ఎన్నికల్లో తన సతీమణి వైఎస్ భారతిని ఎమ్మెల్యేగా బరిలోకి దించాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారతిని బరిలోకి దింపడం ద్వారా ఈ సీటును కూడా తమ కంచుకోటగా మార్చుకోవడంతో పాటు ఇక్కడ కడప స్టీల్ ప్లాంట్ కు ఎలాంటి ఇబ్పందులు లేకుండా చూసుకోవాలని కూడా జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే సుధీర్ రెడ్డికి మరో పదవి ఇచ్చేలా, రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చేలా జగన్ స్కెచ్ సిద్ధం చేసినట్లు సమాచారం.
జగన్ ముందు జాగ్రత్త ?
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్ధితుల్లో వైసీపీ మరోసారి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కేంద్రంపై పోరాడకుండా ఎంతోకాలం వైసీపీ వరుస విజయాలు సాధించడం మాత్రం కష్టం. దీంతో ఏదో ఒక రోజు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పై వైసీపీ సమరశంఖం పూరించడం ఖాయం. అదే జరిగితే జగన్ తో పాటు వైసీపీపై సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్ధలు గతంలోలా విరుచుకుపడటం ఖాయం. వివేకా కేసుతో పాటు జగన్ కేసుల్లోనూ ఈ రెండు సంస్ధలు దూకుడు పెంచితే ఇబ్బందులు తప్పవు. అప్పుడు వైఎస్ భారతి ఎమ్మెల్యేగా ఉంటే జగన్ స్ధానంలో సీఎంగా కూడా మార్చుకునే వెసులుబాటు కూడా లభిస్తుంది. ఇప్పుడు జగన్ కుటుంబసభ్యుల్లో సీఎం పదవి ఇచ్చే పరిస్ధితి ఎవరికీ లేదు. దీంతో భారతిని ఆ దిశగా సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో నిజానిజాలు త్వరలోనే తేలనున్నాయి.