చంద్రబాబు, లోకేష్‌కు కొడాలినాని సవాల్
అమరావతి: చంద్రబాబు, లోకేష్‌కు ధైర్యం ఉంటే మా నియోజకవర్గానికి రావాలి. మీరో.. నేనో తేల్చుకుందాం.. నేను దేనికైనా సిద్ధం.. అంటూ వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ నేత లోకేశ్ పాదయాత్ర చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కొడాలి నాని విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి తూర్పుగోదావరి వచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమలోనే పుట్టావా అని సీఎం జగన్‌ను లోకేష్ అడుగుతున్నారని… లోకేష్ ఎక్కడ పుట్టారని తాము అడిగితే సమాధానం లేదన్నారు. సీఎం జగన్ రాయలసీమలోనే పుట్టి పెరిగారని… నారా లోకేష్ తెలంగాణలో పుట్టి పెరిగారని తెలిపారు. లోకేష్ తెలంగాణలో పుట్టి, పెరిగి ఏపీలోకి ఎందుకు వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ డీఎన్‌ఏ గురించి ప్రశ్నిస్తున్నారని.. ముందు లోకేష్ డీఎన్‌ఎ గురించి చెప్పాలని ఆయన అన్నారు.
చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి దరిద్రం పట్టించారని విమర్శించారు. చంద్రబాబు ఓ అవినీతి చక్రవర్తన్నారు. అవినీతి డబ్బును హెరిటేజ్ పెట్టి చంద్రబాబు కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. జగన్‌ను సైకో అన్న చంద్రబాబే ఓ పెద్ద సైకో అన్నారు. తన అమ్మను ఏదో అవమానించారని లోకేష్ అంటున్నారని.. కానీ చంద్రబాబే తన భార్యను అల్లరి చేశారన్నారు. కావాలంటే అసెంబ్లీ రికార్డును పరిశీలించేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. లోకేష్ వాళ్ల అమ్మ మాత్రమే ఆడదా.. భారతి కాదా అని నిలదీశారు.