: భారత అండర్-19 మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని మొదటిసారి కైవసం చేసుకుంది. వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఏడు వికెట్ల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. మొదట బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ జట్టు 17.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 14 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెఫాలీ వర్మ కెప్టెన్సీలో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత క్రీడాకారిణిగా శ్వేతా సెహ్రావత్ నిలిచింది. ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్‌లోనే ఇంగ్లండ్ ఓపెనర్ లిబర్టీ హీప్‌ను అవుట్ చేసి టైటాస్ భారత్‌కు శుభారంభం అందించింది. నాలుగో ఓవర్‌లో అర్చన దేవి రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లిష్ జట్టు కష్టాల్లో పడింది.
ఆ తరువాత టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్ల తీయడంతో ఇంగ్లండ్ జట్టు కోలుకోలేకపోయింది. స్పిన్నర్లు అర్చన దేవి, పార్శ్వి చోప్రా, ఫాస్ట్ బౌలర్ టైటాస్ సాధు తలో రెండు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌వుమెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. మన్నత్ కశ్యప్, కెప్టెన్ షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ కూడా చెరో వికెట్ పడగొట్టారు. చివరకు 17.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌వుమెన్‌లో నలుగురు మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు. అనంతరం ఈజీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ మొదట్లో తడబడింది. సిక్స్, ఫోర్‌తో దూకుడు ప్రదర్శించిన కెప్టెన్ షెఫాలీ వర్మ (15) మూడో ఓవర్లోనే ఔట్ అయింది. మరో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ (5) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరుకుంది. ఆ తరువాత టీమిండియా బ్యాట్స్‌వుమెన్ సౌమ్య తివారి (24), త్రిష (24) రాణించడంతో విజయం సులువైంది. 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.