భారత్ పైనా చైనా గతేడాది దుస్సాహసానికే పూనుకుందన్న విషయం వెలుగు చూసింది. అమెరికాపైన ప్రయోగించినట్టే భారత్ పైనా చైనా నిఘా బెలూన్ ను ప్రయోగించిందని తెలుస్తోంది. గతేడాది భారత్ లోని అండమాన్ నికోబార్ దీవుల పైనా ఆకాశంలో ఒక పెద్ద బెలూన్ లాంటి వస్తువును స్థానికులు రక్షణశాఖ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.అయితే ఆ సమయంలో దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదంటున్నారు.
ఇటీవల చైనా బెలూన్ను అమెరికా కూల్చివేయడంతో భారత దేశ రక్షణ శాఖ కూడా గతేడాది అండమాన్ నికోబార్ దీవుల్లో ఎగిరిన బెలూన్ పై అప్రమత్తమైంది. చైనా బెలూన్ కనిపించిన అండమాన్ నికోబార్ ద్వీపాలు.. భారత్ క్షిపణి పరీక్షా కేంద్రాలకు దగ్గరగా ఉన్నాయని చెబుతున్నారు. చైనా తదితర దేశాలకు ఇంధనం ఇతర సామగ్రి జల రవాణాకు కీలకమైన మలక్కా జలసంధి కూడా వాటికి సమీపంలోనే ఉంటుందని సమాచారం.
అయితే అండమాన్ నికోబార్ ద్వీపాలపై చైనా ప్రయోగించిన ఆ బెలూన్ అకస్మాత్తుగా ప్రత్యక్షమైందని నాటి పరిణామాలను రక్షణ శాఖ అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. మధ్యలో ఆ వస్తువు అనేక భారత రాడార్ వ్యవస్థలను తప్పించుకుందని పలువురు అధికారులు చెప్పినట్లు ఓ వార్తాసంస్థ కూడా చెప్పడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఆ బెలూన్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఉద్దేశం ఏంటి? కూల్చేద్దామా? వద్దా? అనే దానిపై ఒక నిర్ణయానికి రాకముందే ఆ బెలూన్ అండమాన్ నికోబార్ దీవులపై నుంచి సముద్ర గగనతలంపైకి వెళ్లిపోయిందని చెబుతున్నారు. వాతావరణ పరిశోధనలకు ఉపయోగించే బెలూన్ కావొచ్చని రక్షణ శాఖ అధికారులు భావించినట్లు పేర్కొంటున్నారు. ఇప్పుడు అమెరికా ఉదంతంతో భారత గగనతలంపై ఎగిరిన ఆ బెలూన్ వ్యవహారాన్ని భారత్ అధికారులు ఆరా తీస్తున్నారు.