సోము వీర్రాజు తీరు నచ్చకే రాజీనామా
త్వరలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తా
కన్నా లక్ష్మీనారాయణ వెల్లడి
బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఏపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్య అనుచరుల తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం పట్ల ఆకర్షితుడినై బీజేపీలో చేరానని తెలిపారు. పార్టీలో చేరినప్పటి నుంచి సామాన్య కార్యకర్తగా పనిచేశానని చెప్పారు. దానిని గుర్తించే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారన్నారు. అయితే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రవర్తన బాగాలేదని అన్నారు. అయితే మోదీపై ఉన్న అభిమానం ఎప్పటికీ చెక్కుచెదరదని అన్నారు.
ఈ సందర్భంగా ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమువీర్రాజు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని ఏకతాటిపై నడిపానని, సోమువీర్రాజు అధ్యక్షుడు అయ్యాక పరిస్థితి అంతా మారిపోయిందని అన్నారు. సోమువీర్రాజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. పార్టీలో చర్చించి అభిప్రాయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. తన పాటు రాజీనామా చేసిన అనుచరులకు ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
కాంగ్రెస్‌లో 40 ఏళ్లు పనిచేశానని… ఐదుగురు సీఎంల దగ్గర పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. పదవులు ఆశించి ఏ పార్టీలో పనిచేయలేదన్నారు. పని చేస్తున్నందున పదవులు అవే వచ్చాయని తెలిపారు. క ృషా జిల్లాకు రంగా పేరు పెట్టాలని పోరాడానని.. ఆ ఉద్యమంలో జీవీఎల్ పాల్గొని ఉంటే బాగుండేదని కన్నా అభిప్రాయపడ్డారు. బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డాకు కన్నా తన రాజీనామా లేఖను పంపించారు. కన్నాతో పాటు 15మంది అనుచరులు పార్టీకి రాజీనామా చేశారు.