AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్వార్థపరులకు ఓట్లు వేయవద్దు

ప్రముఖ నిర్మాత నట్టి కుమార్‌
ఫిలిం ఛాంబర్‌, నిర్మాతల మండలి ఎన్నికల్లో స్వార్థపరులకు ఓట్లు వేయవద్దని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్‌ వ్యాఖ్యానించారు. నిరంతరం సినిమా పరిశ్రమ బాగుకోసం పాటు పడిన దాసరి లాంటి పెద్దలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిందిపోయి కొందరు సినీ పెద్దలు వాటికి తిలోదకాలు ఇచ్చే స్థితికి చేరుకోవడం దారుణమని నట్టి కుమార్‌ విమర్శించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పై విధంగా అన్నారు. 7 లక్షల మెడిక్లెయిమ్‌ పాలసీని కౌన్సిల్‌లోని ప్రతీ సభ్యుడికీ అందజేయాలని డిమాండ్‌ చేశారు. నిధులు తక్కువగా ఉంటే కనీసం రూ.5 లక్షల పాలసీ అయినా అందరికీ వర్తింపచేయాలని ఆయన సూచించారు.

సినీ పరిశ్రమ నిలబడటానికి దాసరి లాంటి పెద్దలు కారణమన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆయన తట్టుకుని తన ప్రత్యేకతను చాటుకున్నారని నట్టి కుమార్‌ అన్నారు. తన ప్రయాణంలో ఆయనను ఆకాశానికి ఎత్తినవాళ్లు ఉన్నారు, అలాగే అవమానించిన వాళ్లు లేకపోలేదని చెప్పుకొచ్చారు. అందుకే ఆయన సినీ జీవిత ప్రయాణాన్ని పలు అంశాలతో నేటి తరానికి అందించాలన్న సత్‌ సంకల్పంతో ‘‘ఇదీ దాసరి చరిత్ర’’ పేరుతో ఓ సినిమాను తీయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇది బయోగ్రఫీ కాదని నట్టి కుమార్‌ వెల్లడిరచారు. మే 4న దాసరి బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమాను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, సినీ రంగానికి దర్శకరత్న దాసరి నారాయణరావు చేసిన విశేష సేవలను గుర్తించి విగ్రహాన్ని పార్లమెంట్‌ ప్రాంగణంలో పెట్టాలన్నారు. అలాగే హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోను, పుట్టిన ఊరు పాలకొల్లు లోను దాసరి పేరుతో ప్రత్యేకంగా పార్కులను నిర్మించేలా వివిధ రాజకీయ పక్షాలకు, వివిధ రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేశారు.

తామే సినీ పెద్దలమని చెప్పుకునే కొందరు సినీ పెద్దలు పూర్తిగా స్వార్ధ రాజకీయాలు చేస్తూ, చిన్న సినిమాలను చంపేస్తూ, చిన్న నిర్మాతల వినాశనానికి పూనుకుంటున్నారని ఇదే ప్రెస్‌ మీట్లో నట్టి కుమార్‌ ఆరోపించారు. త్వరలో జరగబోయే తెలుగు ఫిలిం ఛాంబర్‌, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు, ఇంకా నిర్మాతల గిల్డ్‌, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సినిమా పరిశ్రమతో ఉన్న సంబంధాలకు సంబందించిన అంశాలపై ఆయన చర్చించారు. 21 మంది నిర్మాతలు కేవలం వాళ్ల స్వార్ధం కోసం గిల్డ్‌ అని వేరే కుంపటి పెట్టుకుని కూడా తెలుగు ఫిలిం ఛాంబర్‌, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిపై కూడా పెత్తనం చెలాయించడం ఎంతవరకు కరెక్ట్‌ అని ఆయన ప్రశ్నించారు. దిల్‌ రాజు, దామోదర ప్రసాద్‌, స్రవంతి రవికిశోర్‌ వంటి వారు అక్కడా తమదే రాజ్యం… ఇక్కడా తమదే రాజ్యం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వాళ్ళంతా చిన్న నిర్మాతల గురించి అస్సలు ఆలోచించరు . అందుకే అలాంటి వాళ్లను ఎన్నుకోకుండా ఓటర్లు జాగ్రత్త పడాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10