సీపీ రంగనాథ్ ప్రెస్‌మీట్‌లో కీలక వివరాలు వెల్లడి
వరంగల్: ప్రీతిని సైఫ్ వేధించడం నిజమేనని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రీతి చాలా సెన్సిటివ్ అని వెల్లడించారు. ప్రీతి ప్రశ్నించడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడని, ఈ కారణంగానే ప్రీతికి సహకరించవద్దని తన స్నేహితులకు చెప్పాడని శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రీతిని సైఫ్ ఉద్దేశపూర్వకంగానే వేధించాడని రంగనాథ్ నిర్ధారించారు. ప్రీతికి నేర్పించే క్రమంలో గట్టిగా చెబుతున్నానని సైఫ్ వాదిస్తున్నాడని, కానీ మొదట్నుంచీ సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బంది పడుతూ వచ్చిందని వివరించారు.
వాట్సాప్ గ్రూపులో ప్రీతిని టార్గెట్ చేస్తూ సైఫ్ వేధించాడన్నారు. ఇద్దరి మధ్య రెండు, మూడు ఘటనలు జరిగాయని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతి గురించి అవమానకర పోస్టులు పెట్టాడన్నారు. గ్రూపులో పోస్టు పెట్టి తనను అవమానపరచవద్దని సైఫ్‌ని ప్రీతి వేడుకుందన్నారు. తనను అవమానపరిచావని సైఫ్‌తో ప్రీతి చెప్పిందని, ఏదైనా ఉంటే హెచ్‌వోడీల దష్టికి తీసుకురావాలని ప్రీతి కోరిందని వెల్లడించారు.
సైఫ్ తన ఇతర మిత్రులతో కలిసి వాట్సాప్‌లో ప్రీతిని వేధించినట్టు తేలిందని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. 20వ తేదీన సైఫ్ వేధింపుల గురించి ప్రీతి తన తండ్రికి చెప్పిందని వెల్లడించారు. 21న ప్రీతి, సైఫ్‌తో కాలేజీ యాజమాన్యం విచారించిందని తెలిపారు. అయినా సైఫ్ తగ్గకపోవడంతో.. మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసిందని వెల్లడించారు. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్‌ను అరెస్ట్ చేశామని.. దీనిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశామని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు.