క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 3 కోట్ల రూపాయల కారు విషయంలో ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మూడు కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును చీకోటి ప్రవీణ్.. తన బినామీ పేరు మీద తీసుకున్నట్టు తెలిసింది. అయితే.. ఈ కారును ఎందుకు సీజ్ చేయకూడదంటూ ఐటీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. అయితే.. ఈ కారును భాటియా ఫర్నిచర్ పేరుతో కొనుగోలు చేశాడు చీకోటి ప్రవీణ్. కాగా.. ఇప్పటికే చీకోటి ప్రవీణ్ అటు ఫెమా కేసు, ఇటు క్యాసినో వ్యవహారంలో ఈడీ విచాణను ఎదుర్కొంటున్నాడు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటికే చీకోటి ప్రవీణ్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది రాజకీయ నాయకులతో పాటు వారి సన్నిహితులు, వ్యాపారవేత్తలను ఈడీ విచారించింది.
అయితే.. ఇటీవలే సైదాబాద్‌లో ఉన్న చీకోటి ప్రవీణ్ కుమార్ ఇంట్లో కారు చోరీ జరిగింది. కొంత మంది దుండగులు అర్ధరాత్రి వేళ చీకోటి ఇంటికి వచ్చి కారును దొంగిలించారు. చోరీకి ముందు ఇంటి ముందు రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత వాళ్లలో ఒకడు గేటు దూకి చీకోటి ఇంట్లోకి ప్రవేశించి మరీ.. కారు తాళాలను తీసుకొచ్చాడు. అనంతరం పార్కింగ్ ప్రాంతంలో ఉన్న కారును తీసుకొని పరారయ్యాడు. నిద్రలేచి చూసేసరికి పార్కింగ్ చేసిన కారు లేకపోవడంతో చీకోటి ప్రవీణ్.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించాడు. సీసీటీవీ దశ్యాల్లో ముగ్గరు యువకులు వచ్చి కారును చోరీ చేసినట్టు కనిపించింది. దీంతో.. వెంటనే ఆయన పోలీసులను ఆశ్రయించారు.