అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కొడుకు హంటర్ బైడెన్ వాడిన ఓ ల్యాప్‌టాప్ సమస్యలు తెచ్చిపెట్టింది. శుక్రవారం డెలావేర్‌లోని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 6 రహస్య పత్రాలను స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు బైడెన్ చేతితో రాసిన పేపర్లను కూడా ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి తరపు న్యాయవాది శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సోదాలు 13 గంటల పాటు సాగాయని వెల్లడించారు. అమెరికా న్యాయ శాఖ ఈ స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలిస్తోంది. తన వద్ద రహస్య పత్రాలు అత్యంత భద్రంగా ఉన్నాయని.. ఓ సీల్డ్ డబ్బాలో భద్రపరిచినట్లు ఇటీవల బైడెన్ తెలిపారు. అయితే ఆయన ప్రకటన చేసిన వారంలోనే న్యూయార్క్ పోస్టు పత్రిక ఓ సంచలన వార్తను ప్రచురించింది.
అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన ఈ రహస్య పత్రాలు బైడెన్ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నట్లు కథనం రాసింది. ఆ రహస్య పత్రాలు అక్కడ ఉన్న టైమ్‌లోనే బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ పలుమార్లు ఆ ఇంటికి వచ్చినట్లు పేర్కొంది. జో బైడెన్ 1973 నుంచి 2009 వరకు డెలావేర్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఒబామా పరిపాలనలో 2009 నుంచి 2017 వరకు వైస్ ప్రెసిడెంట్ పదవిని నిర్వహించారు. బైడెన్ ‘ప్రామిస్ మి, డాడ్’ అనే పుస్తకం రాసే సమయంలో అమెరికా వైట్ హౌస్ నుంచి ఈ రహస్య పత్రాలను తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆయన వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన పదవీకాలానికి సంబంధించిన కొన్ని రహస్య పత్రాలను బైడెన్ ఇంటి నుంచి ఎఫ్‌బీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో సోదాలు చేసినప్పుడు జో బైడెన్, జిల్ బైడెన్ ఇంట్లో లేరు. డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లోని తమ ఇంట్లో వీకెండ్ పార్టీలో ఉన్నారు.