బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మండిపాటు
హైదరాబాద్: మెడికో స్టూడెంట్ ప్రీతి మరణ వార్త నుంచి కోలుకోకముందే నర్సంపేటలో ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత ర్యాగింగ్‌కు బలికావడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆడపిల్లల భవిష్యత్‌కు గ్యారంటీ లేదన్నారు. కేసీఆర్ కుటుంబ – అవినీతి – నియంత పాలనలో సామాన్యులు బతకలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ‘‘ప్రజాస్వామ్యవాదులారా…. మీ మౌనం సమాజానికే అరిష్టం… ఇకనైనా నోరు విప్పండి’’ అంటూ పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు కళ్లముందే చస్తున్నా స్పందించకపోవడం మానవత్వానికే కళంకమని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూండా, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన అసవరం అందరిపైనా ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు.