ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబ కిశోర్‌పై కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఝార్సుగూడ జిల్లాలోని బ్రిజరాజ్‌నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మంత్రి ఛాతీలోకి నాలుగు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం తీవ్రగాయాలతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి నబ కిశోర్ ఓ ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యేందుకు బ్రిజరాజ్ నగర్‌లోని గాంధీ చౌక్ వద్దకు రాగా.. కారు దిగుతున్న సమయంలో కాల్పులు జరిగాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా దగ్గరగా కాల్పులు జరపడంతో బుల్లెట్లు ఛాతీలోకి దూసుకెళ్లినట్లు తెలిసింది. ఆయనపై ఓ ఏఎస్ఐ సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మంత్రికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
మూడుసార్లు ఎమ్మెల్యే నబ కిషోర్ దాస్ 2004లో ఒడిశాలోని ఝార్సాగూడ స్థానం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై తొలిసారి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో మళ్లీ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. 2014లో కూడా కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నబ కిషోర్ దాస్ బిజూ జనతాదళ్‌లో కీలక నాయకుడిగా ఉన్నారు. అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూస్తూ.. 2015లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నబ కిషోర్ దాస్ పోర్న్ చూస్తూ పట్టుబడ్డారు. దీంతో అప్పటి అసెంబ్లీ స్పీకర్ నిరంజన్ పూజారి వారం రోజుల పాటు ఆయనను సస్పెండ్ చేశారు. ‘నా జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి అడల్ట్ వీడియో చూడలేదు. ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నప్పుడు పొరపాటున ఇది జరిగింది. వెంటనే ఆ వీడియో కనిపించడంతో నేను దానిని కట్ చేశాను..’ అని నబ కిషోర్ వివరణ ఇచ్చారు. మహారాష్ట్రలోని శని శింగణాపుర్ ఆలయానికి కోటి రూపాయలకుపైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు విరాళం ఇచ్చి ఆయన వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.