దేశంలో కోట్లమంది సామాన్యుల సొమ్ము ప్రమాదంలో పడింది.జీవిత బీమాకు ధీమా లేకుండా పోయింది. తనవద్ద ఉన్నది ప్రజల సొమ్ము అన్న ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ, అదానీ కంపెనీల్లో అడ్డగోలుగా పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకొంటున్నది. దేశంలో ఒకే కంపెనీ ఉన్నట్టుగా ఎల్‌ఐసీ సొమ్మును అత్యధికంగా తీసుకెళ్లి అదానీ కంపెనీల్లో కుమ్మరించింది. తీరా ఇప్పుడు హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ సామ్రాజ్యం కుప్పకూలే పరిస్థితి రావడంతో ఎల్‌ఐసీ దీపం కూడా కొండెక్కే పరిస్థితి వచ్చింది. అదానీ పుణ్యమా అని ఎల్‌ఐసీ సంపద రెండురోజుల్లోనే రూ.18 వేల కోట్లకు పైగా హరించుకుపోయింది.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) పాలసీదార్ల నుంచి ప్రీమియంగా వసూలు చేసిన సొమ్ములో భారీ మొత్తం అదానీ షేర్లలో కరిగిపోయింది. అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టిన పెట్టుబడులు రెండు రోజుల్లోనే రూ.18,000 కోట్లకుపైగా తరిగి పోయాయి. అదానీ గ్రూప్ కంపెనీల్లో ఈ నెల 24 నాటికి ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ.81,268 కోట్లు ఉండగా, శుక్రవారం నాటికి రూ.61,621 కోట్లకు పడిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ వాణిజ్య గ్రూప్‌పై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ చేసిన తీవ్ర ఆరోపణలతో అదానీ గ్రూప్ షేర్లు వరుసగా రెండో ట్రేడింగ్ రోజైన శుక్రవారం సైతం నిలువునా పతనమయ్యాయి. ఈ దెబ్బ ఎల్‌ఐసీపై గట్టిగా పడింది.