కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ఖాయం
ఢిల్లీలో ఒప్పందం సైతం కుదుర్చుకున్నాయి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేనని, పాదయాత్రలు.. తిట్టుకోవడాలు ఒక డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమని, ఈ పార్టీలను మేము వేరువేరుగా చూడటం లేదని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వ్యాఖ్యానించారు. దీనిపై ఢిల్లీలో ఒప్పందం సైతం కుదుర్చుకున్నాయన్నారు. సెక్యులర్ పదంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం లు ముందుకు వస్తున్నాయని చెప్పారు.
అధికారంలోకి రావడం కష్టమని కాంగ్రెస్ నాయకులే చెబుతుండటం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ పార్టీ యాత్రలు చేయడం ఎందుకు బీఆర్‌ఎస్‌ను తిట్టడం ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, 119 నియోజకవర్గాల్లో ఒంటరిగా బరిలోకి వెళ్తామని తేల్చిచెప్పారు. 119 నియోజకవర్గాల్లో గెలిచే అభ్యర్థులు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేస్తామన్నారు.
తెలంగాణ నూతన సచివాలయంపై బండి సంజయ్ మరోసారి స్పందించారు. సెక్రటేరియట్ డోమ్ కూల్చివేస్తామన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ సెక్రటేరియట్‌పై తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రూపొందిస్తామని తెలిపారు.