సైఫ్ వేధింపులు మితిమీరుతున్నాయని వెల్లడి
హైదరాబాద్: వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించే ముందు ప్రీతి.. తన బాధను తల్లితో పంచుకున్న ఫోన్ కాల్ సంభాషణ బయటకు వచ్చింది. ‘సైఫ్ వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని తల్లితో వాపోయింది. నాతో పాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని తెలిపింది. సీనియర్లంతా ఒకటిగా ఉన్నారని చెప్పింది. నేను అతడిపై ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా ఒక్కటై నన్ను దూరం పెడతారు’ అని ప్రీతి తల్లితో వాపోయింది.
‘ఇప్పటికే సైఫ్‌పై నాన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రిన్సిపల్ పిలిచి నన్ను అడిగాడు. చదువుకోవాలంటే భయమేస్తోంది అమ్మ’ అని ప్రీతి చెప్పగా.. చదవుపై దృష్టి పెట్టాలని, సైఫ్ ఏం చేయలేడని ప్రీతికి తల్లి ధైర్యం చెప్పినట్లు ఈ ఆడియోలో ఉంది. ప్రీతిని సైఫ్ ఎంతలా వేధించాడో ఈ ఆడియోను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చివరకు అన్ని దారులూ మూసుకుపోవడంతో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిందితుడు సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌లోకి తీసుకున్నారు. సైఫ్ వేధింపుల తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని నిర్ధారించారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ర్యాంగింగ్ యాక్ట్ కింద వరంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.